Telangana Land Resurvey: భూ సమస్యలకు చెక్.. రీ సర్వేపై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు!
తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించిన వివాదాలు, రికార్డుల్లో ఉన్న తప్పులు, కొలతల్లో తేడాలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వే నిర్వహణకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామాల వారీగా సర్వే నిర్వహించడం నుంచి భూ రికార్డుల తుది ఖరారు వరకు మొత్తం ఆరు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.
ఈ మేరకు సీసీఎల్ఏ కమిషనర్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా మినహా తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు ఈ మార్గదర్శకాలను అమలు చేయాల్సి ఉంటుంది. భూముల కొలతల్లో పారదర్శకత, రెవెన్యూ రికార్డుల్లో ఖచ్చితత్వం తీసుకురావడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం.
తెలంగాణలో భూముల రీ సర్వే.. ఆరు దశల్లో ప్రక్రియ
ప్రభుత్వం నిర్దేశించిన విధానం ప్రకారం భూముల రీ సర్వేను ఆరు దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటగా గ్రామాల వారీగా సర్వే నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపడతారు. అనంతరం క్షేత్రస్థాయిలో భూములను కొలిచి, గుర్తించిన విస్తీర్ణాన్ని సంబంధిత రైతులకు తెలియజేస్తారు.
ఇందిరమ్మ బీమా అప్లికేషన్ విడుదల.. కుటుంబ పెద్దకు రూ.5 లక్షలు! ఎలా అప్లై చేయాలి?
మూడో దశలో తహసీల్దార్ స్థాయిలో భూ రికార్డులను పరిశీలించి, సర్వే వివరాలతో సరిపోల్చి వెరిఫికేషన్ చేస్తారు. నాలుగో దశలో గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి రైతుల నుంచి వచ్చే సమస్యలు, భూ వివాదాలను పరిశీలిస్తారు. మిగిలిన దశల్లో అభ్యంతరాలు, అప్పీళ్లను పరిష్కరించి, అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత తుది భూ రికార్డులను ఖరారు చేస్తారు.
సర్వే విస్తీర్ణంలో తేడాలు ఉంటే రైతులకు సమాచారం: రీ సర్వే పూర్తయిన వెంటనే కొలిచిన భూమి విస్తీర్ణాన్ని సంబంధిత పట్టాదారులకు తెలియజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పహాణీలో నమోదైన భూమి విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో కొలిచిన విస్తీర్ణానికి తేడా ఉంటే ఆ విషయాన్ని రైతుల దృష్టికి తీసుకెళ్లాలి. ఈ వ్యత్యాసాలకు కారణాలను ఫీల్డ్ రిజిస్టర్లో స్పష్టంగా నమోదు చేయాలని అధికారులకు సూచించింది.
గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు: భూ సమస్యలను పరిష్కరించేందుకు తహసీల్దార్లు గ్రామస్థాయిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి. రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలు, అభ్యంతరాలను ఈ క్యాంపుల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. క్యాంపుల నిర్వహణ అనంతరం మూడు, నాలుగు రోజుల్లోనే సంబంధిత భూ వివాదాల కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
అప్పీళ్ల పరిష్కారం తర్వాతే తుది గెజిట్: భూ రీ సర్వే ప్రక్రియలో సెక్షన్ 9(2) కింద నోటీసులు జారీ చేసిన తర్వాత వచ్చే అప్పీళ్లపై అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలి. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, అప్పీళ్లను పూర్తిగా పరిశీలించి పరిష్కరించిన తర్వాతే సెక్షన్ 13 కింద తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి.
తుది గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే భూ భారతి చట్టంలోని ఆర్వోఆర్ (RoR) రికార్డుల సవరణ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాల అమలులో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు రెవెన్యూ అధికారులు కీలక పాత్ర పోషించనున్నారు.
మొత్తంగా తెలంగాణలో భూముల రీ సర్వే ద్వారా భూముల విస్తీర్ణం, రెవెన్యూ రికార్డుల్లోని వ్యత్యాసాలు, వివాదాలను క్రమబద్ధంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియ పూర్తయితే భూ రికార్డుల నిర్వహణలో స్పష్టత పెరిగే అవకాశం ఉంది.